ఆదర్శమూర్తి , మహిళాభ్యుదయ రచయిత్రి - కనుపర్తి వరలక్ష్మమ్మ వ్యక్తిత్వం
ప్రముఖ సంఘసేవా తత్పరురాలూ, రచయిత్రీ అయిన కనుపర్తి వరలక్ష్మమ్మగారు (1896-1978) స్వాతంత్ర్యోద్యమంలో విస్తృతంగా కృషి చేసిన మహా మనీషి. వీరేశలింగంగారు ప్రారంభించిన ఉద్యమాలూ, స్వాతంత్ర్య సమరమూ మంచి వూపు అందుకున్న సమయం అది. వరలక్ష్మమ్మగారిమీద ఆ వుద్యమాలప్రభావం చాలా వుంది. గాంధీగారి నాయకత్వంలో విదేశీ వస్త్రబహిష్కరణలో పాల్గొని ఆమె ఖద్దరు ధరించడం ప్రారంభించారు. స్త్రీలని విద్యావంతులని చేయడానికీ, విజ్ఞానవతులని చేయడానికీ బాపట్లలో స్త్రీహితైషిణీ మండలి స్థాపించారు. స్త్రీలు ఓటుహక్కు వినియోగించుకోవాలని అనేకవిధాల పాటు పడిన ఆదర్శ మహిళ. ఆమె సామాజిక విలువలూ, వ్యక్తిత్వం కొంతవరకూ ఆమె రచనల్లో ద్యోతకమవుతాయి.
వరలక్ష్మమ్మగారి తొలి నవల వసుమతి. ఆవిడకి 14 సంవత్సరాలప్పుడు, ఒక దీనురాలు తల్లితో చెప్పుకుంటున్న హృదయవిదారకమైన చరిత్ర విని, మనసు ద్రవించి ఆకథ రాయాలని చాలా వేదన పడ్డారుట. ఆ తరవాత మరో నాలుగేళ్లకి ఆ కథ రాయడం జరిగింది కానీ ప్రచురించడానికి చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆఖరికి 1925లో సాధించారు. అప్పటికి ఆమె వయసు 29.
వసుమతి నవలలో కథ సాధారణమయినదే. వసుమతి చిన్నపిల్ల, అమాయకురాలు. ఆనాటి ఆచారాలప్రకారం చిన్నతనంలోనే పెళ్లి చేశారు. భర్త ఆనందరావు చెడుసావాసాలకి లోనై, నాగమణి అన్న ఒక వేశ్యతో సంపర్కం పెట్టుకుని భార్యని హింసిస్తూ వుంటాడు. నాగమణి ప్రోత్సాహంతోనే భార్యని వదిలి, రంగూను వెళ్లిపోతాడు. అక్కడ నాగమణి అతడిని చులకన చేసి ఇతర సంబంధాలు పెట్టుకుంటుంది. రంగూనులోనే పరిచయమయిన మరొక తెలుగు పుస్తకప్రచురణ కర్త సుందరరావు సాహచర్యంలో ఆనందరావుకి జ్ఞానోదయమయి. అతను తిరిగి స్వగ్రామం వచ్చి వసుమతితో చక్కగా సంసారం చేసుకుంటాడు.
రచయిత్రి కథనరీతి, సందర్భానుసారం కథలో పొందుపరిచిన సాంఘిక పరిస్థితులూ, వాటిపై ఆమె వ్యాఖ్యానాలు మనని ఆకట్టుకుంటాయి.
నవల ప్రారంభంలో ఆశ్వీయుజుమాసంలో శరన్నవరాత్రులూ, పూర్వవైభవమూ సూక్ష్మంగా వర్ణించి “అకటా ఆనాటి వైభవములిప్పుడేవీ” అంటూ చిన్న విచారం వెలిబుచ్చి, వసుమతి ఇంటి వాతావరణం వివరిస్తారు రచయిత్రి.. అసురసంధ్యవేళ, వసుమతి పుస్తకం పట్టుకుని కూచుంది. “అసురసంధ్యవేళ చదవరాదని చెప్పలేదా? కొంచెమాగి, దీపము పెట్టినతరవాత చదువుకో”మంటుంది తల్లి. వసుమతికి ఆ పుస్తకం విడవలేనంత ఆసక్తికరంగా వుంది. తల్లీ కుమార్తెల సంభాషణ చదువుతుంటే మనకి ఆహ్లాదకరమైన గృహవాతావరణం ప్రస్పుటమవుతుంది. ఈనాడు కూడా చాలామంది అమ్మాయిలకి ఇది అనుభవమే కావచ్చు.
ఇంతలో ఎవరో తలుపు దీయమని పిలిచారు. తల్లి వసుమతిని తలుపు తీయమంటుంది. దట్టంపు జిలుగు కుచ్చిళ్ల పావడాతో, గీరల చొక్కాతో, పిఱుదులదాకుతూ బెత్తెడు వాలుజడ వీపున గునిసియాడ, వసుమతి తలుపు తీయడానికి వెళ్లినదిట. మళ్లీ రెండోసారి ఆ అమ్మాయి పెళ్లి అయినతరవాత, భర్తకోసం ఎదురుచూస్తూ కూర్చున్నసమయంలో కూడా ఆమె అందచందాలు ఒకటిన్నర పేజీల్లో వర్ణస్తారు వరలక్ష్మమ్మగారు పుట్టుకతో వచ్చిన సౌందర్యమే కానీ పెట్టు సౌందర్యం కాదని చెప్పడానికి (56-57) .
అయితే ఆవిడ వాక్యవిన్నాణం కేవలం వర్ణనలకే పరిమితం కాదు. తన అభిప్రాయాలు కూడా సమయోచితంగా, నర్మగర్భంగా తెలియజేస్తారు. తెలుగుపడుచులకి సాధారణమైన నగలమీద వ్యామోహం వరలక్ష్మమ్మగారికి గిట్టదు. కొంతవరకూ ఇది స్వాతంత్ర్యోద్యమ సమయంలో స్త్రీలు ఆ ఉద్యమంకోసం తమ నగలు ఒలిచి దానం చేయడం కావచ్చు. వరలక్ష్మమ్మగారు కూడా స్వాతోంత్ర్యోద్యమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఆ ప్రభావం కావచ్చు. అందుకే ఆవిడ వసుమతి మోయలేనన్ని నగలు ధరించలేదు అని ఒక చిన్నవాక్యంలో పూర్తి చేయలేదు. చూడండి.
“సుందరమనుకొని చెవులనిండ సందు లేకుండ రంధ్రములు పొడిచి వివిధరూపములు తగిలించుకొని ముత్యముల యొక్కయు బంగారముచే కర్ణములు ముందుకు వ్రాలుటయు. ఒకానొకప్పుడు కుట్లు తెగుటకు కారణమైన నందవికారపు నగల ధరింపక ఆపూబోడి ధృఢమయిన క్రింది తమ్మెలకి దానిమ్మగింజలవంటి కాంతివంతములయిన కెంపులను మాత్రము శ్రోత్రాలంకారముగా దాల్చెను” అంటారు.
ఈ వాక్యం చాలు వరలక్ష్మమ్మగారి నిశిత పరిశీలనాశక్తి, భాషాపాటవం, వైయక్తికవిలువలు, సూత్రప్రాయంగా వివరించాడానికి.
భర్త పోయిన నాటికి వసుమతి తల్లి మహలక్ష్మమ్మగారికి పాతికేళ్లు. వసుమతికి మూడేళ్లు. అన్నగారు రామచంద్రుడికి ఆరేళ్లు. పెద్దకూతురు రాజ్యలక్ష్మిని భర్త అభీష్టం ప్రకారం ఆడబిడ్డ కొమారుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది తల్లి. రామచంద్రుడు వసుమతికి చదువు చెప్తాడు. చారిత్ర్యకంగా ఇది వీరేశలింగంగారు ప్రవేశపెట్టిన స్త్రీవిద్య ఉద్యమప్రభావాన్ని సూచిస్తుంది. ఆకాలంలో వివేకవంతులయిన అన్నదమ్ములూ, తండ్రులూ స్త్రీవిద్యని సమర్థిస్తూ ఆడపిల్లలకి ఇంట్లోనే చదువుకునే అవకాశాలు కల్పించారు. వీరేశలింగంగారి అభిప్రాయాలకి విరుద్ధంగా, వసుమతికి రామచంద్రుడు కేవలం సతీధర్మాలే కాక, భూగోళం, చరిత్ర, లెక్కలూ కూడా పాఠాలు చెప్తాడు. వరలక్ష్మమ్మగారు స్త్రీవిద్యని సమర్థించే వాదనలకి రామచంద్రునీ, వ్యతిరేక వాదనలు ప్రవచించడానికి దుర్మార్గుడయిన వసుమతి భర్త ఆనందరావునీ వాడుకోడం గమనార్హం.
వసుమతి విద్యావంతురాలయినా సనాతనధర్మాన్ని కూడా పాటిస్తుంది. భర్త ఎంత దుర్మార్గుడయినా శాంతంగా అతనిని సంతోషపెట్టడమే తన ధర్మమని నమ్మి ఆచరణలో పెట్టిన సాధ్వి. ఇది కూడా వరలక్ష్మమ్మగారి వ్యక్తిత్వంలో భాగమే. రామచంద్రుని మంచి గుణాలు వర్ణిస్తూ, పూర్వాచారాల్లోనూ ఆధునికభావాల్లోనూ మంచిని తీసుకుని, వాటిని పరిశీలించి, సమన్వయపరుచుకుని, తనకి తాను ఒక నిర్దుష్టమయిన మార్గాన్ని ఏర్పరుచుకున్న మేధావిగా చిత్రస్తారు అతనిని. అలా చేయడంలో ఆమెకి సనాతనధర్మాలపట్ల గల గౌరవం కూడా వ్యక్తమవుతుంది.
నవల చివరిభాగంలో ఆనందరావుకి జ్ఞానోదయం కలిగించిన ఘట్టం కూడా వరలక్ష్మిగారు నేర్పుగా చూపించారు అనిపించింది నాకు.
ఆనందరావు నేరుగా చెప్పకపోయినా, సుందరరావుగారు అతని పరిస్థితి గ్రహిస్తారు. భార్యని తీసుకురమ్మని అనేక విధాల చెప్తారు. అనేక పుస్తకాలు ఇచ్చి చదవమంటారు. ఆనందరావుమీద ఆవేవీ పని చెయ్యలేదు. ఒకరోజు యదాలాపంగా సుందరరావుగారి బల్లమీద “హరిదాసి” అన్న పుస్తకం చూసి అదేమిటి అని అడుగుతాడు ఆనందరావు. ఆయన అతనికి ఆపుస్తకం ఇచ్చి చదవమంటారు. అది అతడికి జ్ఞానోదయం అవడానికి కారణమయింది. రచయిత్రి ఈసంఘట్టనలో “మనం అనుకున్నట్టు, పుస్తకాలూ సలహాలూ ఎల్లవేళలా పని చెయ్యవు. ఎప్పుడు ఏ కారణంగా తెలివి వస్తుందో చెప్పడం కష్టం” అని అన్యాపదేశంగా చెప్పుతున్నట్టు అనిపించింది నాకు. నిత్యజీవితంలో జరిగేది అదే కదా.
వరలక్ష్మమ్మగారు ఆనాటి సాహితీక్షేత్రం కూడా నిశితంగా పరిశీలిస్తూనే వుండేవారు అనడానికి తార్కాణం ఆమె 1940వ దశకంలో ప్రచురించిన “కథ ఎట్లా వుండాలె” అన్న చిన్నకథ. అందులో వరలక్ష్మమ్మగారు ఆనాటి విమర్శనాధోరణులని తీవ్రంగా విమర్శిస్తారు. అసలు ఈకథ నడిపించిన తీరే నాకు విశేషంగా కనిపించింది. శీర్షిక చూస్తే కథ కాదేమో అన్న అనుమానం కూడా వస్తుంది. కథ అంతా భార్యాభర్తల మధ్య సంభాషణగా సాగుతుంది.
భర్త తన రచనమీద “మంచి సమీక్ష వచ్చింది” అంటాడు.
“అది రాసింది ఎవరు?” అని అడుగుతుంది భార్య. ఇక్కడే కనిపిస్తుంది రచయిత్రి చమత్కారం. ఆమె ప్రశ్న “ఏమని రాసేరు?” అని కాదు, “ఎవరు రాసేరు?” అని!
“ఎవరో పేరు రాయలేదు” అంటాడు భర్త.
“మీ స్నేహితుడో, మీ స్నేహబృందంలోవాడో అయివుంటాడు” అంటుంది ఆమె.
ఈ వాక్యాలలో వ్యాఖ్యాతలు వస్తునిష్ఠతో కాక, వ్యక్తిగత స్నేహాలు ప్రాతిపదికగా – ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం – అన్న పద్ధతిలో సమీక్షలు రాసి ప్రచురిస్తున్నారన్న వ్యాఖ్యానం కనిపిస్తుంది. ఆ తరవాత మంచి కథ ఎలా వుండాలో, మంచి కథ లక్షణాలేమిటో చెప్తుంది భార్య.
ఈకథలో నన్ను ఆకట్టుకున్న విషయం, మొదటిది, విమర్శకులధోరణి. దాదాపు అరవై ఏళ్లక్రితం ఆమె వర్ణించిన ధోరణి ఈనాటి పరిస్థితులకి కూడా అన్వయించుకోవచ్చు మనం కొంతవరకూ. రెండోది భార్యాభర్తలసంబంధం. భార్య కూడా విద్యావంతురాలు. భర్తతో ముఖాముఖి “మీ స్నేహితులు ఇలాటివారు, మీరచనలకి వస్తున్న సమీక్షలు ఇలా వుంటున్నాయి” అని నిస్సంకోచంగా చెప్పగల ధీమంతురాలు. ఆడవాళ్లబతుకులు హేయం, హీనాతిహీనం అని ఆవిష్కరిస్తూ చాలా కథలు వచ్చాయి. వస్తున్నాయి. కాని దానికి ప్రత్యామ్నాయంగా ఇతర కోణాలు కూడా ఆవిష్కరించినప్పుడే, జాతి సంస్కృతి సంపూర్ణంగా మనకి అర్థం కాగలదు. ఆవిధంగా ఈకథకి ఒక ప్రత్యేక స్థానం వుంది అనుకుంటున్నాను నేను.
కథాకథనసంవిధానం పరిశీలిస్తే ఈనాడు ప్రాచుర్యంలో వున్న కొలమానాలు ఈకథకి నప్పవు. అంటే కౌతుకాన్ని రేకెత్తించే ఆరంభం, పట్టి ఊపేసే సంఘర్షణా, చమత్కారంతో కూడిన ముగింపూ లేని కథ ఇది. అయినా ఇది కథే. వ్యాసం కాదు. కథకి కావలసిన ఆవరణా, పాత్రచిత్రణా వుంది. .
వరలక్ష్మమ్మగారు రచించిన మరొక వచన కావ్యం విశ్వామిత్ర. (1963). విశ్వామిత్రుడు కోపిష్టి అని జనసామాన్యంలో వాడుక. అందుకు భిన్నంగా వరలక్ష్మమ్మగారు ఆయనని ధర్మనిష్ఠాగరిష్ఠునిగా, బ్రహ్మర్షి పదవి సాధించిన దీక్షాపరునిగా చిత్రిస్తారు. ఆనాటి సాంఘికపరిస్థితులు, పశుబలం-ఆత్మబలాల్లో తారతమ్యాలూ ఎత్తి చూపుతూ కులపరమైన చర్చలూ చేస్తూ, విశ్వామిత్రుని మానవతావాదిగా ఆవిష్కరిస్తారు. మానవుడు పుట్టుకచేత కాక గుణకర్మలచేత ఔన్నత్యం సాధించగలడనీ, దానికి విశ్వామిత్రుడే సాక్షి అనీ ప్రతిపాదిస్తారు ఆమె.
నాకు ఇలాటి పుస్తకాలు చదవడం ఇష్టం.. ఇందులో అచ్చతెలుగు నుడికారం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను మరిచిపోయిన పదకేళిని గుర్తుకి తెచ్చింది. “కొండంత తండ్రికన్న ఏకులబుట్టంత తల్లి మేలను లోకసామ్యమును సార్థకము చేసినది” అంటారు వసుమతి తల్లి భర్త పోయినతరవాత సంసారాన్ని ఎలా ఈదుకొచ్చిందో చెపుతూ. చిన్నపుస్తకమే (158 పేజీలు) అయినా మనసుని రంజింపజేసే జాతీయాలు మణుగులకొద్దీ వున్నాయి. ఒక్కమాటలో, నాచేత ఆసాంతం విడవకుండా చదివించిన పుస్తకమిది.
వరలక్ష్మమ్మగారు రచించిన ఇతరకథల్లో విశేషంగా ఆదరణ పొందినకథ పెన్షను పుచ్చుకున్ననాటి రాత్రి.. నాకు దొరక్కపోవడంచేత ఈకథనిగురించి వ్యాఖ్యనించలేను. ఆమె రాసిన మరొక గ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు. ఇది పైన చెప్పిన ఆర్కైవ్స్ లో లభ్యం.
రాజ్యలక్ష్మమ్మగారు పొందిన సత్కారాలుః గృహలక్ష్మీ స్వర్ణకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, గుడివాడ పౌరుల నుండి కవితా ప్రవీణ బిరుదు.
నేను తూలికలో చాలాసార్లు మరుగున పడిపోతున్న మన రచయితలగురించి, మనం పునః పరిశీలించుకోవలసిన అవుసరంగురించి ప్రస్తావించాను. పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారికి వరలక్ష్మిగారితో బాగా పరిచయం ఇద్దరూ బాపట్లవారే కావడంచేత. రాజ్యలక్ష్మిగారు నాకు రాసిన వుత్తరంలో వారి పరిచయంగురించి ప్రస్తావిస్తూ, “నాతరవాత నా పుస్తకాలు ఎవరికీ అక్కర్లేదు. నువ్వు తీసుకో” అన్నారని రాసేరు. ఆమాటకి నిదర్శనమేమో అన్నట్టుగా ఈమధ్య ఒక వాక్యం కనిపించింది నాకు. వరలక్ష్మమ్మగారి కుటుంబసభ్యులే నడుపుతున్న ఒక సైటులో ఆమె 1986 లో మరణించినట్టు రాశారు (www.Indiastories.org, July 2007). కానీ వరలక్ష్మమ్మగారు 1978లో మరణకాలం శతజయంతి సంచికలోనూ (సం. దాసరి శారద) ఇంకా చాలా పత్రికలలో ప్రచురింపబడింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి