Elakuchi Venkatakrishnaiah -Balasaraswathi-Telugu Padhya Kavi,Rachayakudu,Pandithudu-ఎలకూచి బాలసరస్వతి -Biography.

Elakuchi Venkatakrishnaiah -Balasaraswathi-Telugu Padhya Kavi,Rachayakudu,Pandithudu,History,Story,Biography.

 

ఎలకూచి బాలసరస్వతి 
ఎలకూచి బాలసరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన జటప్రోలు సంస్థానములోనే. నెల్లూరు జిల్లా పొదిలి తాలుకాలోని ఎడవిల్లి అగ్రహారం వీరి జన్మస్థానం. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం విజయనగరంలో గడిపారు. తరువాత తెలంగాణలోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు.
సాహితీ ప్రస్థానం
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు "ఎలకూచి వెంకటకృష్ణయ్య". బాల్యంలోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది. ఆరు భాషలలో పండితుడు. "షడ్భాషా వివరణము" అనే వీరి గ్రంథం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం, బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు విజయనగరంలో ఉండిన కాలంలోనే నన్నయ్య రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు.అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు నన్నయ పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత త్ర్యర్థి కావ్యంగా 'రాఘవ యాదవ పాండవీయం' అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు భీముడు, కాశీరాజు కూతురు నాయకా, నాయికలుగా "చంద్రికా పరిణయం" అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి సురభి మాధవరాయల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని తెలుగు చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే.మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరు మీదగా 'మల్ల భూపాలీయం' గా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు. ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. 'సురభి మల్లా! నీతి వాచస్పతీ! ' మకుటంతో నీతి శతకాన్ని,' సురభి మల్లా! మానినీమన్మథా! ' మకుటంతో శృంగార శతకాన్ని,' సురభి మల్లా! వైదుషీ భూషణా! "మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం. ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా జటప్రోలు సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే, బాలసరస్వతికీ జటప్రోలు సంస్థానం గౌరవాన్ని చేకూర్చింది.
ఇతనికి మహోపాధ్యాయ బిరుదము కలదు. అందువల్ల ఇతడు కవిగా కాక ఎక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాడు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయమను త్ర్యర్థికావ్యమున స్వవిషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
రచనలు
రాఘవ యాదవ పాండవీయం (త్యర్థి కావ్యం)
రంగ కౌముది (నాటకం)
కార్తికేయాభ్యుదయం (ప్రబంధం)
వామన పురాణం (ప్రబంధం)
బాహటం (ప్రబంధం)
చంద్రికా పరిణయం (ప్రబంధం)
భ్రమరగీతాలు
మల్లభూపాలీయం (అనువాదం)
భాషా వివరం (లక్షణ గ్రంథం)
ఆంధ్ర శబ్ధ చింతామణి వ్యాఖ్యానం
స్స్వీయ చరిత్ర పద్యములు
కవిమాహి తరంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ
సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధ కర్త
నంధ్ర చింతామణీ వ్యాఖ్యాత భాషా వివరణాది బహుతంత్రకరణ చణుఁడ
వేద శాస్త్ర పురాణ వివిధ సంగీత సాహిత్యాది విద్యోపబృంహణుఁడ
ననఘ కౌండిన్య గోత్రుండ హరిపదాబ్జ, భక్తి శీలుండ నెలకూచి భైరవార్య
కృష్ణదేవతనూజుండ నే విచిత్ర, కావ్యమొక్కటి నిర్మింపఁగాఁ దొడగి. " "
మెండైనట్టి విచిత్ర వైఖరులచే మీఁదౌ మహా కావ్యముల్
దండిం దొల్లియ చేసి రాదిములు తద్కావ్యాధిక శ్లాఘ్యమై
యుంటన్ రాఘవ కృష్ణ పాండవ కథా యుక్త ప్రబంధంబు వా
క్పాండిత్యం బలరార శ్లేషరచనైక ప్రౌఢినేఁ జేసెదన్. "
అని వ్యాసికొని యున్నాడు. కాని సుభాషిత త్రిశతి కాంధ్రానువాదమగు మల్లభూపాలీయమున కవతారికా పద్యములు లభింపమిచే నందేమి వ్రాసికొనియున్నాడో తెలియరాదు.
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
ఆయన రచనల విశిష్టత
బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న యక్షగానములతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో సరిపోల్చ వచ్చును.
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి, సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
ఉదాహరణలు
శ్రీ మద్బాల సరస్వతీ ప్రకటలక్ష్మీ హేతువై శాంత మై యా మోదావహ మై నిజానుభవ వేద్యం బై యనే హోదిగా ద్యామేయ ప్రవిదోధరూపమహితం బై యొప్పుతేజంబు ప్రా పై మీకి న్సిరు లీపుతన్, సురభిమల్లా నీతి వాచస్పతీ. " ఉల్లం బక్కల హంసపైఁ గుపితమై యున్న న్విరోదింపఁ గా నిల్లౌ దాని సరోజనీ వనమె మాయింప న్సమరుండు; తా నీళ్లు న్బాలును నేర్పరింపఁ గల పాండిత్యంబు మాంపంగ లేఁ డల్లోకేశ్వరుఁ డేమెయి, న్సురభిమల్లా నీతి వాచస్పతీ.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget