Akkiraju Sundara Ramakrishna-Telugu Kavi,Padhyakavi,Telugu Gayakudu,Telugu Adhyapakudu,Telugu Cinema Natudu-అక్కిరాజు సుందర రామకృష్ణ-Biography.

Akkiraju Sundara Ramakrishna-Telugu Kavi,Telugu Padhyakavi,Telugu Gayakudu,Telugu Adhyapakudu,Telugu Cinemanatudu,Natakaramgam,Natudu,story,Biography.

 అక్కిరాజు సుందర రామకృష్ణ
అక్కిరాజు సుందర రామకృష్ణ (ఏప్రిల్ 23, 1949) పద్యకవి, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
జీవిత విశేషాలు
అక్కిరాజు సుందర రామకృష్ణ తండ్రి అక్కిరాజు రామయ్య. తల్లి అన్నపూర్ణమ్మ. ఆయన గుంటూరు జిల్లా నరసారావుపేట లో 23 ఏప్రిల్ 1949 లో జన్మించాడు. ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు ఈయన సోదరుడు. మరొక సోదరుడు అక్కిరాజు జనార్ధనరావు పేరుపొందిన జర్నలిస్ట్. నరసారావుపేటలో డిగ్రీ వరకు చదివిన సుందర రామకృష్ణ హైదరాబాద్లో ఎం.ఎ., ఎం.ఓ.ఎల్., ఎం.ఫిల్ చేశాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వేంకటపార్వతీశకవులు - రామాయణ పద్యకృతులు అనే అంశం పై ఇరివెంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. థియేటర్ ఆర్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. తెలుగు సంస్కృతం ఆంగ్లం కలిపి నూతన మణిప్రవాళ భాషను సృష్టించినవాడు. సందర్భోచితంగా ఉర్దూ పదాలు కూడా మస్తుగా వాడుకున్నాడు.
సాహిత్యం
అమ్మతోడు, కేశవామాధవా, కోనేటి రాయనికి, బాపూరమణా, తేనీటి విందు, కవీశ్వరా, శంకరనారాణీయము, రాజేశ్వరీ శతకము, శ్రీ శనీశ్వర శతకము, అమెరికాలో కవిసుందర్ - శ్యామసుందర్, కవితాశరథి దాశరథి, ఆంజనేయ శతకం, భీమన్న, భీమలింగ శతకం మొదలైన కావ్యాలు వ్రాశాడు.
శతక సాహిత్యం
1. కృత్తివాస శతకం-
రచనా శైలి
"గర్వించ దగ్గ వేద పండితుడు గరిమెళ్ళ" 09-14-2018 (శుక్రవారం)
 సీ. "వేద గాయత్రికి" ప్రియ సుతుండౌచు, వి
                 రాజిల్లు చుండిన ప్రథితు డరయ
           ఇతని వాగ్ధాటికి, ఈశుని శిరమున్న
                 చెలువయే ప్రేమ నాశీర్వదించె
             ఇతని వేగంబుకు ఇంతి “గౌతమి” మెచ్చి 
               కాశ్మీరు శాలువన్ గప్పె నెపుడొ   
             ఇతని "నశ్యము పట్టు", మతి చలింపగ జేయు
                 తద్దయు మాకు హితైషులకును
           ప్రథిత "గరిమెళ్ళ" వంశాన ప్రభవ మంది
           శిష్య వాత్సల్య యుతు డౌచు క్షితిని నేడు
           ఐన్ద్ర ఖండాన విద్యా బృహస్పతిగ నలరు
           "వీర భద్రావధానినిన్" వినుతి జేతు!
           అరయ నాభి జాత్య మధికంబు నున్నట్టు
             పైకి దోచు నట్టి వాడె గాని
           సుంత మనసు బెట్టి, చూడగా నీతండు
             సకల గతుల నెన్న సద్గురుండు!
           నిగమ వంద్యు డైన నీల కంఠుని జ్యేష్ఠ
           సుతుని గతిని విద్య, సొంపు మీర   
           పుష్కలముగ భళిర, పొట్టలో దాచిన
           ప్రతిభు డరయ "వీర భద్రు" డితడు!
           శత్రు విదారణుండు, బుధ సన్నుతుడౌ మొనగాడు, సృష్టికే
           మిత్రుడు నైన భాస్కరుని, మేటి ప్రచండుని దైన దంతమే
           చిత్రము నూడ గొట్టిన, విశిష్టుడు ప్రోచుత నూర్వసంతముల్,
           మిత్ర వరేణ్యుడైన “గరిమెళ్ళ” కులాంబుధి వంశ చంద్రునిన్!
 
           అరవిందమ్ములవంటి కన్నుగవ తో ఆస్యాన చిరునవ్వుతో
           అరి నీలమ్ములబోలు ముంగురులతో అద్వైతమౌ శక్తివై
           కరుణా మూర్తిగ నిత్యనూత్నమగు శృంగారాన నామోమునన్
           చిరకాలంబు రటింపుమమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరీ !!  
                       
           వింతలకెల్ల వింత యన విశ్వమునందు మహానుభావ! , నీ
           చెంత విబూది దక్క మరి చిల్లిది గవ్వయు లేకయుండినన్
           పంతము బూని, నిన్ వలచె పార్వతి పార్వణ రాజబింబ, నీ 
           కింతగ గర్వమందులకె ఈశ! మహేశ! నిజంబెరింగితిన్!
                       
సంగీతం
బాల్యం నుండే నటన గానం పట్ల మక్కువ చూపేవాడు. ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, ఘంటసాల వెంకటేశ్వరరావు మొదలైన వారిని అనుకరించేవాడు. ఈయన గొప్ప గాయకుడే కాక మంచి సంగీతదర్శకుడు కూడా. లక్ష్మీనరసింహ సుప్రభాతం, బాసర సరస్వతీవైభవం, శ్రీకృష్ణరాయబారం, షిర్డీసాయి సుప్రభాతం, గణేశ సుప్రభాతం, వేంకటేశ్వర స్తుతి, క్రీస్తు రక్షకా మొదలైన సి.డి.లను కూర్చి విడుదల చేశాడు. ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో ఏ గ్రేడ్ డ్రామా ఆర్టిస్ట్ గా వున్నాడు.
సినిమా రంగం
వందకు పైగా సినిమాలలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి చిత్రంలో అక్కిరాజు గవర్నర్గా నటించాడు. ఠాగూర్ సినిమాలో ప్రిన్సిపాల్గా కనిపించాడు. నాగార్జున నటించిన శివ సినిమాలో లెక్చరర్గా, ఎగిరే పావురమా చిత్రంలో సంగీతకారునిగా ఆయన నటించి అందరినీ మెప్పించాడు.
టి.వి. / నాటకరంగం
ఆదికవి నన్నయ్య, శ్రీనాథ కవిసార్వభౌమ, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ మొదలైన పాత్రలను టీవీ సీరియళ్ళలో పోషించాడు. పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, బిల్వమంగళుడు, భరతుడు, కాళిదాసు, అర్జునుడు మొదలైన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శ్రీకృష్ణతులాభారం నాటకంలో ప్రముఖసినీనటి జమునతో కలిసి అనేక ప్రదర్శనలలో నటించాడు. జెమిని టీవీలో, తేజ టీవీఛానల్లో పెళ్లిపందిరి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తి.తి.దే.బ్రహ్మోత్సవాలకు సుమారు 15 సంవత్సరాలపాటు వ్యాఖ్యానం చేశాడు.
అధ్యాపకుడిగా
2005 లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా పురస్కరింపబడినాడు. ఇంటర్ మీడియెట్ తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠాలను తయారు చేశాడు. 2007 లో లెక్చరర్గా పదవీ విరమణ చేశాడు.
బిరుదులు
కవితాగాండీవి నాట్యశ్రీనాథ అభినవ తెనాలిరామకృష్ణ అభినవ ఘంటశాల పద్యవిద్యామణి • కళాప్రవీణ వశ్యముఖి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget